తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బ్యాంకుల ద్వారా సులభతరంగా రుణాలు పొందేందుకు, అలాగే రుణాలు తీసుకుని బకాయిలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న రైతులు రుణ విముక్తి నుంచి ఉపశమనం పొందేందుకు వన్ టైం సెటిల్‌మెంట్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతులకు ఇది సువర్ణావకాశమని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం బ్యాంకర్లతో హరీశ్‌రావు సమీక్షా సమావేశం జరిపారు. ఈ సమీక్షలో బ్యాంకు రుణ విముక్తికై వన్ టైమ్ సెటిల్మెంట్ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామీణ ప్రాంత రైతుల వ్యవసాయ రుణాలకు సంబంధించి అన్నీ బ్యాంకులు తప్పనిసరిగా రెన్యూవల్ చేయాలని బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి హరీశ్‌రావు.
ముంపునకు గురైన రైతుల భూములకు సంబంధించి, వారి రుణాల విషయంలో బ్యాంకులు ప్రత్యేక పథకాలు రూపొందించి వారికి రుణ విముక్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని బ్యాంకర్లను ఆదేశించారు మంత్రి హరీశ్‌రావు. జిల్లా వ్యాప్తంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఏపీజీవీబీ, టీజీబీ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు రుణ విముక్తి కలగనుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. వివిధ బ్యాంకుల నుంచి ఓటీఎస్ స్కీమ్ కింద 12 శాతం నుంచి 50 శాతం వరకు మొండి బకాయిలు ఉండి, క్రాప్ లోన్ తీసుకుని తిరిగి కట్టలేక పోయిన వారికి నాలుగు బ్యాంకుల నుంచి వన్ టైమ్ సెటిల్‌మెంట్ చేసుకునే వెసులుబాటు కలగనుందని తెలిపారు మంత్రి హరీశ్‌రావు.