అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని నర్సీపట్నం కృష్ణ బజార్ సెంటర్‌లోని అంబికా జ్యువెలరీ షాపులో అగ్నిప్రమాదం జరిగింది. అంబికా జ్యువెలరీ షాపులో ఉన్న వ్యాపారీ మల్లేశ్వర్‌రావు కుటుంబం మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో మల్లేశ్వర్‌రావు అతడి కుమారుడు మృతి చెందారు. ఆయన భార్య, కుమార్తెకు గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. స్టీల్‌ప్లాంట్ ఆర్‌ఎంహెచ్‌పీ (రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్)లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విభాగంలోని రెండు కన్వెయర్లు కొంతమేర దగ్ధమయ్యాయి. ఇందుకు సంబంధించి కార్మిక నాయకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కర్మాగారంలోని సింటర్ ప్లాంట్-2 విభాగానికి రా మెటీరియల్ సరఫరా చేస్తుండగా సీవో 37ఏ కన్వెయర్‌కు కింద వుండే పుల్లీషెల్ విడిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఓఎస్ కన్వెయర్-1 వరకు వ్యాపించాయి. ఈ సంఘటనలో సీవో 37ఏ కన్వెయర్ సుమారు 80 మీటర్లు, ఓఎస్-1 కన్వెయర్ 40 మీటర్లు దగ్ధమైనట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది హూటాహూటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు