పాకిస్థాన్‌లోని ఒక పెద్ద షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ మాల్ పై అంతస్తుల వరకు మంటలు, పొగలు వ్యాపించాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఆదివారం ఈ సంఘటన జరిగింది. సెంటారస్ మాల్‌లోని మూడో అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది. రాజుకున్న మంటలు, దట్టమైన పొగలు ఆ బిల్డింగ్ 20వ అంతస్తు, ఆపై వరకు వ్యాపించాయి. దీంతో పై అంతస్తుల్లో ఉన్న నివాసితులు భయాందోళన చెందారు. కాగా, సమాచారం అందుకున్న పాక్ అగ్నిమాపక, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని పాక్ మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే అగ్నిమాపక, సహాయక బృందాలు సకాలంలో చేరుకోలేకపోవడంతో మంటలు మరింతగా వ్యాపించినట్లు ఆరోపించాయి. మరోవైపు పాకిస్థాన్ మాల్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎవరికీ ఏ ప్రమాదం జరుగకూడదంటూ నెటిజన్లు, ఆ దేశ ప్రజలు ప్రార్థించారు.