భారత్ లో బుల్లెట్ ట్రైన్ లను సాకారం చేసే దిశగా ఎన్ హెచ్ఎస్ఆర్ సీఎల్ కార్యాచరణ రూపొందించారు. భారతదేశంలో మొదటి బుల్లెట్ రైలు నడవాలంటే ఇంకా ఐదేళ్లు ఆగాలి. 2027 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తవుతందని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఏఎన్ఐతో చెప్పారు. ఆగస్టు 2027 నాటికి గుజరాత్లో బుల్లెట్ రైళ్లను నడపడానికి కంపెనీ ప్రయత్నిస్తుందని అన్నారు.
అన్నీ అనుకున్నట్టుగా జరిగితే 2027 నాటికి దేశంలో తొలి బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. ఈ రైలు అహ్మదాబాద్, ముంబయి మధ్య తిరిగే అవకాశాలున్నాయి. జపాన్ రైల్వే శాఖ షింకాన్ సెన్ పేరిట ఎన్నో ఏళ్లుగా అత్యంత సమర్థతతో బుల్లెట్ రైళ్లు నడుపుతోంది. ఈ హై స్పీడ్ రైళ్ల గరిష్ఠ వేగం గంటకు 320 కిలోమీటర్లు. ఇలాంటి బుల్లెట్ రైళ్లను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది.
మొత్తం 24 షింకాన్ సెన్ రైళ్లను కొనుగోలు చేయాలని కేంద్రం భావిస్తోంది. వాటి అంచనా వ్యయం రూ.11,000 కోట్లు. ప్రధానంగా జపనీస్ సంస్థలనే బిడ్డింగ్ కు పిలుస్తున్నట్టు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే, జపాన్ దేశానికి చెందిన సంస్థలకు ఈ షింకాన్ సెన్ రైళ్ల తయారీ, నిర్వహణలో అపార అనుభవం ఉంది. బుల్లెట్ రైళ్ల తయారీలో ఇప్పటివరకు హిటాచీ రైల్, కవాసాకీ హెవీ ఇండస్ట్రీస్ సంస్థలు అగ్రగాములుగా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ బిడ్డింగ్ లోనూ ఈ రెండు జపనీస్ సంస్థల మధ్యే పోటీ ఉంటుందని భావిస్తున్నారు.