కరోనా మహమ్మారి విజృంభణ ఉత్తర కొరియాలో కొనసాగుతోంది. యావత్తు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా రక్కసి ఇప్పుడు ఉత్తర కొరియా ప్రజలపై విరుచుకు పడుతోంది. ఇటీవలే ఉత్తర కొరియాలో మొదటి కరోనా కేసులు గురువారం నమోదయింది. అయితే ఒక్క రోజు వ్యవధిలో మరో బాధితుడు మహమ్మారితో కన్నుమూసినట్లు ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. రాజధాని ప్యాంగాంగ్‌లో జర్వంతో మొత్తం ఆరుగురు మరణించారని, వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. మృతుడిలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2ను గుర్తించినట్లు పేర్కొన్నారు అధికారులు.
కాగా, దేశంలో 18 వేల మంది జ్వరంతో బాధపడుతున్నారని మే 12న అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఆ సంఖ్య 1,87,800కు చేరిందని.. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. కాగా, వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి కిమ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి, లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఉత్తర కొరియన్లు ఇప్పటివరకు కరోనా టీకా తీసుకోలేదు. మహమ్మారిని అడ్డుకోవడానికి తాము టీకాలు అందిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో, రష్యా, చైనా ప్రకటించినప్పటికీ.. కిమ్ తిరస్కరించారు. కాగా, 2020 నుంచి ఈ ఏడాది మే 11 వరకు ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదవలేదని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది.