విమానయాన సంస్థ ఇండిగో.. దేశీయంగా తయారు చేసిన గగన్ వ్యవస్థను ఉపయోగించిన తొలి సంస్థగా రికార్డ్ ను నెలకొల్పింది. మొదటి నుంచి విమాన ప్రయాణాల్లో విదేశాల్లో రూపొందించిన నావిగేషన్ సిస్టం ఆధారంగానే పైలెట్లు విమానాలు నడుపుతుంటారు.. అయితే మేకిన్ ఇండియాలో భాగంగా సొంత నావిగేషన్ వ్యవస్థకి కేంద్రం శ్రీకారం చుట్టడంతో.. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థలు సంయుక్తంగా గగన్ (జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్యుమెంటెడ్ నావిగేషన్) వ్యవస్థను అభివృద్ధి చేయడం విశేషం.
అయితే 2022 ఏప్రిల్ 27న ఇండిగో సంస్థ ఏటీఆర్ 72 ఎయిర్‌క్రాఫ్ట్‌ను గగన్ ఆధారంగా నడిపించింది. ఈ విమానం గగన్‌ను ఉపయోగిస్తూ విజయవంతంగా రాజస్థాన్‌లోని కిషన్‌గడ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. చిన్న విమానాశ్రయాల్లో ల్యాండింగ్‌కు గగన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌స్ట్రుమెంటల్ ల్యాండింగ్ సిస్టమ్ లేని ఎయిర్‌పోర్టుల్లో గగన్ ద్వారా సులువుగా ల్యాండ్ అవడం సాధ్యమవుతుంది.