అధిష్టానం ఆయన్ని పట్టించుకోవడం లేదా

-

రాజకీయాల్లో ఆయనో సీనియర్‌ నాయకుడు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాంటి నేతకు ఇప్పుడు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే టాక్‌ నడుస్తోంది. అప్పట్లో పెద్దాయన దూకుడికి ఒక నాయకుడు బ్రేక్‌ వేస్తే.. ఇప్పుడున్న ఎమ్మెల్యే భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశారని చర్చ జరుగుతోంది.

గుర్నాథరెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొడంగల్‌ నియోజకవర్గంలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. ఈ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యారాయన. అప్పట్లో కనుసైగతో అన్నీ శాసించేవారు. అలాంటిది ఇప్పుడు గుర్నాథరెడ్డి ఏం చెప్పినా పట్టించుకునేవారు లేరు. ఉనికే ప్రమాదంలో పడిందని అనుకుంటున్నారు. 2009 నుంచి రాజకీయాలు కలిసి రావడం లేదని చెబుతున్నారు.

2009లో రేవంత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు గుర్నాథరెడ్డి. 2014లో టీఆర్‌ఎస్‌లో చేరి మరోసారి బరిలో నిలిచినా గెలవలేదు. ఆ విధంగా రేవంత్‌ చేతిలో పెద్దాయన దూకుడికి బ్రేక్‌లు పడ్డాయి. ఇక గుర్నాథరెడ్డి పవర్‌ అయిపోయిందని అనుకున్నారో ఏమో.. 2018 ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించింది టీఆర్‌ఎస్‌. పట్నం నరేందర్‌రెడ్డిని బరిలో దింపి రేవంత్‌ను ఓడించింది. కొడంగల్‌లో పట్నం గెలుపు గుర్నాథరెడ్డి రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టిందని టీఆర్‌ఎస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

పునర్విభజనలో భాగంగా కొడంగల్‌.. వికారాబాద్‌ జిల్లాలోకి వచ్చింది. మద్దూరు, కోస్గి మండలాలు మాత్రం నారాయణపేట జిల్లాలోకి వెళ్లాయి. ఇది కూడా గుర్నాథరెడ్డి రాజకీయ జీవితాన్ని గందరగోళంలో పడేసిందని సమాచారం. 2018లో ఎమ్మెల్యే టికెట్‌ పట్నం నరేందర్‌రెడ్డికి ఇస్తున్న సమయంలో పార్టీలో గుర్నాథరెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని.. ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇస్తాయని టీఆర్‌ఎస్‌ పెద్దలు హామీ ఇచ్చారట. ఇంత వరకు ఆ పదవుల ఉసే లేదట.

మహబూబ్‌నగర్‌ డీసీసీబీ చైర్మన్‌ పదవి గుర్నాథరెడ్డికి ఇస్తారని ప్రచారం జరిగింది. పార్టీ పెద్దలు చెప్పడం వల్లే కొడంగల్‌ సింగిల్‌విండో చైర్మన్‌గా ఏకగ్రీవంగా గెలిచారు కూడా. అయితే డీసీసీబీ విషయంలో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యే పట్నం తనకు సహకరించలేదని గుర్రుగా ఉన్నారట గుర్నాథరెడ్డి. పైగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి సింగిల్‌ విండో చైర్మన్‌ను చేసి అవమానించారని ఆయన అనుచరులు మండిపడుతున్నారట. ఈ విషయంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.

ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌లో మరో ప్రచారం జరుగుతోంది. గుర్నాథరెడ్డి కుమారుల్లో ఒకరు కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా ఇంకొకరు గ్రామ సర్పంచ్‌గా.. వరసకు కుమారుడయ్యే మరో నేత ఎంపీపీగా ఉన్నారు. అందుకే గుర్నాథరెడ్డికి డీసీసీబీ చైర్మన్‌ పదవి ఇవ్వలేదని చెబుతున్నారు. కారణం ఏదైనా.. అసంతృప్తిగా ఉన్న గుర్నాథరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news