పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ మేరకు జాతీయ పార్టీపై నిర్ణయం తీసుకున్నారు. దసరా రోజున మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. దసరా రోజున టిఆర్ఎస్ కార్యవర్గ భేటీలో జాతీయ పార్టీకి ఆమోదం తెలపరున్నారు. దసరా రోజున ఉదయం 11 గంటలకు మరోసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మొత్తం 283 మంది పార్టీ నేతలు సమావేశం కానున్నారు. జాతీయ పార్టీ తీర్మానం పై సంతకాల తర్వాత మధ్యాహ్నం 1:19 గంటలకు పార్టీ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు.
సీఎం కేసీఆర్ దసరా రోజు ప్రకటించబోయే జాతీయ పార్టీ గురించి పలు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో భారత రాష్ట్రీయ పార్టీ, మహాభారత్ రాష్ట్రీయ పార్టీ , నవభారత్ రాష్ట్రీయ పార్టీ పేర్లు ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఎవరూ వాడని పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే పార్టీ పేరు మారినా, కారు గుర్తు ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
కొత్త పార్టీ అంటే సమస్యలు వస్తాయని.. ఇప్పటికే ఉన్న పార్టీ పేరు మార్చుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదని సీఎం కేసీఆర్ అన్నట్లు సమాచారం. సాంకేతికంగా సమస్యలు వచ్చినా వాటిని అధిగమించవచ్చని.. పార్టీ పేరు మారినా కారు గుర్తు మనకే ఉంటుందని.. దీనివల్ల బిజెపి – కెసిఆర్ పార్టీ మధ్య పోటీ ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నట్లు సమాచారం.