హైదరాబాద్‌లో వర్షం తగ్గి రెండ్రోజులవుతున్నా పలు ప్రాంతాలు మాత్రం జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాలు జలమయమై ఆ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఉదయం వరకు వరద ఉద్ధృతితో ఉప్పొంగిన జంట జలాశయాలు ప్రస్తుతం కాస్త నెమ్మదించాయి.
జంట జలాశయాలకు వరద ఉద్ధృతి తగ్గుముఖం పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఉస్మాన్ సాగర్ లోకి 3వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, హిమాయత్ సాగర్ కు 400 క్యూసెక్కుల నీరు వస్తోందని తెలిపారు. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా….. 1787 అడుగులకు చేరిందని వెల్లడించారు. దీంతో అధికారులు పది గేట్ల ద్వారా మూసీలోకి 6వేల 90 క్యుసెక్కుల నీటిని వదులుతున్నారు.
మరోవైపు హిమాయత్ సాగర్ కి ఇన్ ఫ్లో భారీగా తగ్గుతున్నట్టు అధికారులు ప్రకటించారు. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1763 అడుగులు కాగా… ఇప్పటికే 1760 అడుగులకు చేరింది. దీంతో హిమాయత్ సాగర్ ఒకగేట్ ద్వారా మూసీలోకి 330 క్యూసెక్కుల నీటిని వదలుతున్నట్టు పేర్కొన్నారు.