ఉత్తరకొరియా అంటేనే మనకు మరో చైనాలా అనిపిస్తుంది. అక్కడ జరిగేది బయటి ప్రపంచానికి తెలియదు. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంత అని ప్రపంచ దేశాలు కోడై కూస్తుంటాయి. గతంలో అణు పరీక్షలు నిర్వహించి వార్తల్లో నిలిచాడు. తరువాత కోవిడ్ నేపథ్యంలో బయటి ప్రపంచానికి ఆ దేశం నుంచి దారులన్నింటినీ మూసి వేశారు. అయితే ఆ దేశం ప్రస్తుతం తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫలితంగా అక్కడ నిత్యావసరాలు, పండ్లు, కూరగాయల ధరలు కనీవినీ ఎరుగని రీతిలో రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.
ఉత్తరకొరియాలో ప్రస్తుతం ధరలు ఆకాశాన్నంటి ఎక్కడికో వెళ్లిపోయాయి. అక్కడ కేజీ అరటి పండ్ల ధర 45 డాలర్లు (సుమారుగా రూ.3,335)గా ఉంది. అలాగే బ్లాక్ టీ ఒక ప్యాకెట్ ధర రూ.5,190 ఉండగా, ఒక ప్యాకెట్ కాఫీ పొడి ధర రూ.7,414 పలుకుతోంది. దీన్ని బట్టి చూస్తే అక్కడ ఆహారానికి ఎంతటి సంక్షోభం ఏర్పడిందో ఇట్టే అర్థమవుతుంది.
అక్కడ గతేడాది వచ్చిన టైఫూన్ కారణంగా పెద్ద ఎత్తున పంటలను రైతులు నష్టపోయారు. దీంతో అన్నింటి దిగుబడి భారీగా తగ్గింది. ఫలితంగా ఆహారానికి, ఆహార ఉత్పత్తులకు తీవ్రమైన కొరత ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ 8.60 లక్షల టన్నుల ఆహార పదార్థాల కొరత ఉందని ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కిమ్ కార్మికులను ఎక్కువ గంటల పాటు పనిచేయాలని ఆదేశించారు. కానీ ఇప్పట్లో ఆ సంక్షోభం తగ్గేలా కనిపించడం లేదు. పైగా కోవిడ్ కారణంగా అన్ని దేశాలకు ఆ దేశం సరిహద్దులను మూసి వేసింది. దీంతో ఇతర దేశాల నుంచి ఆహార పదార్థాలను దిగుమతి చేసుకునే సదుపాయం లేదు.
కేవలం చైనాపైనే ఉత్తర కొరియా ఎక్కువగా ఆధార పడింది. కానీ ఆ దేశం నుంచి కూడా అంతంత మాత్రంగానే ఆహార పదార్థాలు దిగుమతి అవుతుండడం ఉత్తరకొరియాను ఆందోళనకు గురి చేస్తోంది. మరి అక్కడి ఆహార సంక్షోభం ఎన్నడు ముగుస్తుందో చూడాలి.