నెల్లూరు నగర తెలుగుదేశం ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డిని, రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు కారుతో ఢీ కొట్టి పరారైన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలాజీ నగర్ లోని కోటంరెడ్డి ఇంటి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కోటంరెడ్డి కుమారుడు ప్రజయ్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు.
ఆయన స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి శనివారం తాగి తమ ఇంటికి వచ్చి గొడవకు దిగాడని కోటంరెడ్డి బంధువులు తెలిపారు. రాజశేఖర్ రెడ్డి కి సర్ది చెప్పి వదిలి వెళ్ళేందుకు శ్రీనివాసుల రెడ్డి బయటకు రావడంతో కారులో ఎక్కిన రాజశేఖర్ రెడ్డి వేగంగా కారుతో ఆయన్ని ఢీ కొట్టి పరారయ్యాడని చెప్పారు.
రోడ్డుపై పడిపోయిన శ్రీనివాసుల రెడ్డిని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఎమ్మెల్యే అనిల్ కుమార్ వీరిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు అచ్చెన్నాయుడు. అచ్చం నాయుడు వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. తనపై అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. జిల్లాలో ఏం జరిగినా నాకు ఆపాదించడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. టిడిపి నేతలు అబద్ధాలు చెబుతూ గడుపుతున్నారని ఆరోపించారు.