ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్.జగన్ చేసిన ప్రజాసంకల్ప యాత్రకు ఇవ్వాళ్టితో (శనివారం) నాలు గేళ్లు పూర్తి చేసుకుంది. ఇడుపుల పాయలో దివంగత మహానేత వైయస్సార్ సమాధివద్ద 2017 నవంబర్ 6న పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలో 13 జిల్లాలను దాటుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు.
క్షేత్రస్థాయిలో రాష్ట్రం నలుమూలలా జగన్ పాదయాత్ర చేశారు. ఎండల తీవ్రతను, భారీ వర్షాలను, వణికించే చలిని ఇలా అన్ని కాలాల్లోనూ పాదయాత్ర సాగింది. ప్రతికూల వాతావరణంలోనూ సడలనీయక పాదయాత్ర సాగింది. జనం మధ్యే అడుగు మొదలుపెట్టి.. జనం మధ్యే శ్రీ జగన్ విడిదిచేశారు. పాదయాత్ర సమయంలో జనం చెప్పిన సమస్యలు వింటూ, వారి కన్నీళ్లు తుడుస్తూ ముందకు సాగారు జగన్.
నేను ఉన్నానంటూ.. వారికి ఎనలేని భరోసా నిచ్చారు.చదువు, ఆరోగ్యం కోసం కుటుంబాలు ఆస్తులు అమ్ముకునే పరిస్థితులను తాను చూశానని, కచ్చితంగా ప్రజలకు అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. వివక్షలేని పాలనను అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ముంగిటకే సేవలను తీసుకొస్తానని చెప్పారు. దీంట్లో భాగంగానే మతం చూడకుండా, రాజకీయం చూడకుండా, అవినీతిలేని, వివక్షలేని రీతిలో ప్రజలకు ప్రయోజనాలు అందుతున్నాయి.