రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తుందని, రేషన్ డీలర్ల సంక్షేమం కోసం సైతం
తీవ్రంగా కృషి చేస్తున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్ బాస్కర్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, రేషన్ డీలర్ల గౌరవాధ్యక్షుడు దేవేందర్ రెడ్డితో కలిసి రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘాల జేఏసీ ప్రతినిధులతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014కు ముందు కేవలం టన్నుకు 200రూ. మాత్రమే ఉన్న కమీషన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో 900 రూపాయలకు పెంచడంతో పాటు అనేక సంక్షేమ చర్యలు తీసుకున్నారని మంత్రి తెలియజేసారు. ఈ సందర్భంగా డీలర్ల సంఘం ప్రతినిధులు మంత్రి దృష్టికి తమ సమస్యలు తీసుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. గత నెలలో సమస్యల పరిష్కారానికి రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టారు. అయితే.. సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేస్తున్న రేషన్ డీలర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో వారు సమ్మె విరమించారు. సచివాలయంలో రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులతో మంత్రి సమావేశమై గతంలో ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒకరూ ఆకలితో ఉండకూడదన్న సీఎం కేసీఆర్ లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు.