భారీగా కురుస్తోన్న వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి భారీగా పెరగడంతో భద్రాచలం లోని గోదావరి నీటిమట్టం 42 అడుగులు దాటింది. గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో మరీ కాసేపట్లో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకోనుంది. దీంతో ఏ క్షణమైనా అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఇప్పటికే అధికార యంత్రాంగము అప్రమత్తమైంది.
ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి వరద ప్రవాహం పెరిగిందని, ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశామన్నారు. వరదల వల్ల 15 గ్రామాలు ముంపునకు గురువుతాయని, దీంతో ఆ గ్రామ ప్రజల కోసం పునరావాస కేంద్రాలు సిద్ధం చేశామని చెప్పారు. రెండో ప్రమాద హెచ్చరిక దాటితే స్లూయిజ్‌లు లీక్ కాకుండా మోటర్లు రెడీ చేశామని వెల్లడించారు.