కొడితే కుంభస్థలమే బద్దలవ్వాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే చిన్నచితక సినిమాల ద్వారా కెరియర్ ను కొనసాగించడం అంటే కష్టం. అందుకే ఒకేసారి అంతర్జాతీయంగా చిత్రాన్ని తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు బాలకృష్ణ.. అసలు విషయంలోకెళితే ఈసారి అఖండ సినిమాతో ఇండస్ట్రీని ఒక్కసారిగా షేక్ చేసిన బాలకృష్ణ ఈ సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న బాలయ్య గ్యాప్ దొరికితే చాలు ఆహా ఓటీటీ వేదికగా అన్ స్టాపబుల్ షో తో పాటు మరికొన్ని ప్రకటనలలో కూడా పాల్గొంటున్నారు.
తాజాగా బాలకృష్ణ ఒక అంతర్జాతీయ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రముఖ నిర్మాత తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ తెలిపారు. శుక్రవారం కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకున్నారు. ఈ సందర్భంగా సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. బాలకృష్ణతో రామానుజాచార్య చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు సన్నహాలు చేస్తున్నాము. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఒక అంతర్జాతీయ సంస్థ రవి కొట్టారకరతో కలిసి చిన్న జీయర్ స్వామి సహకారంతో ఈ ప్రాజెక్టు చేయాలని ప్లాన్ చేస్తున్నాము అని చెప్పుకొచ్చారు.
అంతేకాదు ఈ సినిమాను అమ్యూస్మెంట్ పార్క్ ఆరంభోత్సవం రోజున ప్రారంభించడానికి చూస్తున్నట్లు తెలిపారు. అయితే నిర్మాత సి.కళ్యాణ్ అమ్యూస్మెంట్ పేరుతో ఒక పార్క్ ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. ఈ విషయం పైన మాట్లాడుతూ.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో దీనిని నిర్మిస్తున్నాము. ప్రజలకు కావలసిన వినోదం , ఆహారం, సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని ఇందులో ఉంటాయి. దాదాపు రూ.200 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టును నేను చేయడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను అంటూ తెలిపారు. మొత్తానికైతే బాలయ్యతో అంతర్జాతీయంగా సినిమా చేస్తున్నామని ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.