ఏపీలో వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. పూరపాలక సాధారణ సబార్డినేట్ సర్వీస్ నిబంధనల ప్రకారం వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులకు అన్ని రకాల సెలవులు వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పూరపాలక శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెలవులకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
సచివాలయాల్లో ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించి ఐదు నెలలు అవుతుంది. అయితే సెలవుల విషయంలో రెండేళ్ల ప్రొబేషన్ కాలం నాటి విధానమే మొన్నటి వరకు అమల్లో ఉంది. దీంతో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు సాధారణ, ఆప్షనల్ సెలవులే వినియోగించుకోగలుగుతున్నారు. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు పురపాలక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. అందుకే పురపాలక సర్వీస్ నిబంధనల ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే అన్ని రకాల సెలవులు వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శులతో సహా సచివాలయాల ఉద్యోగులందరికీ వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు.