తెలంగాణ రాష్ట్రంలో పండుగలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సనత్ నగర్ డివిజన్ లోని మునిసిపల్ గ్రౌండ్ లో సనత్ నగర్ కార్పొరేటర్ లక్ష్మి బాల్రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు మంత్రి తలసాని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ పండుగ అని వ్యాఖ్యానించారు.
కేవలం తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ పండుగను నేడు విశ్వవ్యాప్తంగా జరుపుకోవాలని మనకు గర్వకారణం అన్నారు. మహిళలు ఇబ్బంది పడకుండా రేషన్ షాపుల దగ్గరే చీరలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంవత్సరం 340 కోట్లతో కోటి 18 లక్షల చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పండుగలను గొప్పగా.. సంతోషంగా జరుపుకోవాలని టిఆర్ఎస్ ప్రభుత్వ ఆకాంక్ష అని కొనియాడారు. రాష్ట్ర ప్రజలంతా బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని మంత్రి కోరారు.