గవర్నర్ తమిళిసైతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కి, పొన్నం, జగ్గారెడ్డి, కోదండ రెడ్డి పలువురు కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ కు చేరుకున్నారు. పలు కీలక అంశాలపై గవర్నర్ తో చర్చించనున్నారు తెలంగాణా కాంగ్రెస్ నేతలు.
మొత్తం 13 అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని నేతలు నిర్ణయించారు. ప్రధానంగా హైదరాబాద్ లో డ్రగ్స్ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తారు. ఇటీవల హైదరాబాద్ డ్రగ్స్ కల్చర్ పెరుగుతున్న క్రమంలో వీటిపై సమీక్ష చేయాలని గవర్నర్ ను కోరనున్నారు. డగ్స్ ను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని గవర్నర్ జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కోరనున్నారు. వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి.. తక్కువ ధరకు అమ్మిన రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని కోరనున్నారు. పెరిగిన విద్యుత్ ధరలపై కూడా గవర్నర్ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. జీవో 111ను ఎత్తివేస్తున్న నేపథ్యంలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ధరణి వెబ్ సైట్, రాష్ట్రంలో వైద్యారోగ్యం, ఇటీవల ఎంజీఎంలో ఎలుకలు కొరికిన ఘటన మొదలైన అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.