గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికకు ముహుర్తం కుదిరింది. ఫిబ్రవరి 11న కొత్త పాలకవర్గం కొలువుదీరుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అదే రోజు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుందని తెలిపింది. గ్రేటర్‌లో హంగ్ రావడంతో మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 11న కొత్త మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు. ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు ముందుగా మేయర్, ఆ తర్వాత డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు. ఏదైనా కారణాలతో 11న ఎన్నిక నిర్వహించలేని పక్షంలో మరుసటి రోజు ఎన్నిక నిర్వహించాలని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.
ఇటీవలి ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ 56 సీట్లకే పరిమితమైంది. 2016 ఎన్నికల్లో 99 చోట్ల నెగ్గి ఏకపక్షంగా గ్రేటర్ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్న గులాబీ పార్టీకి ఈసారి ఏకంగా 43 స్థానాలు తగ్గాయి. బీజేపీ 48 డివిజన్లలో విజయం సాధించింది. కాగా మజ్లిస్ మరోసారి తన బలాన్ని 44 స్థానాల్లో నెగ్గించుకుంది. అయితే ఇక్కడ ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా కీలకం కాబోతున్నాయి. దీంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మేయర్ పదవికోసం సీనియర్ కార్పోరేటర్లతో పాటు కొత్తగా కార్పోరేటర్‌గా ఎన్నికైన మహిళా నేతలు పోటీ పడుతున్నారు. విపక్షాలు బలంగా ఉండడంతో..కౌన్సిల్‌ను చాకచక్యంగా నిర్వహించగలిగే రాజకీయ నేర్పు ఉన్న మహిళా నేతను అభ్యర్ధిగా ఖరారు చేయాలని టీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీలో 50శాతం మహిళా కార్పోరేటర్లే ఉం డగా, ఆశావహులు.. తమకు నేతలతో ఉన్న అనుబంధం, పార్టీకి అందించిన సేవలు, కుటుంబ నేపథ్యం వివరిస్తూ అధిష్టానాన్ని మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
భారతీనగర్ డివిజన్ నుండి గెలుపొందిన సింధూ ఆదర్శ్‌రెడ్డి పేరు మొదట బలంగా వినిపించింది. మెదక్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కోడలు కావడం, సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్సీకి ఆదినుండి మంచి సంబంధాలు ఉండడం విధేయత కోణంలో కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయ శాంతి రెడ్డి పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉంది. గత అసెంబ్లి ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే టికెట్‌కు మొదట విజయశాంతి పేరు ఖరారుచేసినా, ఈ సీటు కోసం మైనంపల్లి హన్మంతరావు పట్టుబట్ట డంతో విజయావకాశాలను పరిగణనలోకి తీసుకుని అధిష్టానం అటు వైపు మొగ్గు చూపింది.
ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెంది మన్నె గోవర్దన్ రెడ్డి భార్య మన్నె కవితారెడ్డి పేరు కూడా బలంగా రేసులో వినబడుతోంది. గత అసెంబ్లి ఎన్ని కల్లో మన్నె గోవర్దన్ రెడ్డి స్ధానంలో టికెట్‌ను దానం నాగేందర్‌కు కేటాయించారు. సికింద్రాబాద్ నియో జకవర్గానికి చెందిన మోతె శోభన్ రెడ్డి భార్య శ్రీలత పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి పేరు కూడా బలంగా వినబడుతోంది.
150 మంది కార్పొరేటర్లలో ఒకరు ఇటీవలే మృతిచెందారు. వీరితోపాటు గ్రేటర్ పరిధిలోని రాజ్యసభ, లోక్‌సభ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. 150మంది కార్పొరేటర్లతో కలుపుకుని 45మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు మొత్తం 195మంది మేయర్ ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారు. వీరు సమావేశమై మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం పార్టీలకు విప్ జారీ చేసే అవకాశం ఉంది. పోలైన ఓట్లలో ఎవరికి ఎక్కువ వస్తే వారికే పీఠం దక్కుతుంది. విప్ ఉల్లంఘించిన వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటే తుది తీర్పు మేరకు చర్యలుంటాయి.