వస్తు, సేవల పన్నుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తాజాగా ప్రారంభమైంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జీఎస్టీ కౌన్సిల్ ఇవాళ సమావేశమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు సహా పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు హాజరయ్యారు.
గత ఏడాది అక్టోబర్ 7న చివరిసారిగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత జరగాల్సిన కౌన్సిల్ మీటింగ్‌ను.. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఇటీవలే కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రిగా మరోసారి నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. దీంతో తదుపరి కౌన్సిల్ మీటింగ్‌ను ఇవాళ నిర్వహించారు.