అధికారంలో ఉన్నంత కాలం ఆయనకు ఎదురు లేదు. అధికారం కోల్పోయాక ఆయనను పట్టించుకున్న వారే లేరు.ఇప్పడు ఏం చేయాలి ? ఇదే సందిగ్ధతల్లో ఉండిపోయారు కొడాలి నాని. ఉండి పోయారు కాదు ఉండిపోతున్నారు కొడాలి నాని. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత పేరు చెబితే అంతెత్తున తిట్టిపోసిన ఆయన, ఇప్పుడు ఆ వేగంలో లేరు. ఆ వాదంలో లేరు. అప్పటి మాదిరిగా తిట్టాలంటే ఆయనకు మనసు ఒప్పుకోవడం లేదా? అన్నది ఓ సంశయం. పదవి లో ఉన్నంత కాలం బూతులు తిట్టిన నాయకులు ఎవ్వరూ తరువాత పెద్దగా బయటకు వచ్చి అంతే ధైర్యంతో మాట్లాడిన రోజులు అయితే గత కాలంలో లేవు. ఇప్పుడూ అదే జరుగుతోంది. ఆయన మాట్లాడడం లేదు.
అంతేకాదు వైసీపీ శ్రేణులకు పెద్దగా టచ్ లో కూడా లేరు అని తెలుస్తోంది. కాస్తో కూస్తో నెల్లూరు కేంద్రంగా మాజీ మంత్రి అయిన అనిల్ కుమార్ యాదవ్ ఒక్కరే హడావుడి గా తిరుగుతున్నారు. ఆయన కూడా షరతులకు లోబడే పనిచేయాలి అన్నది అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆయనే కాదు నాని కూడా ఆ విధంగానే షరతులకు లోబడే అవసరం ఉన్న మేరకే స్పందించాల్సి ఉంటుందని అధిష్టానం చెప్పి ఉంటుందని సొంత పార్టీ మనుషులే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదివరకు విపక్షాలను తిట్టిన దాఖలాలు ఉన్నా ఇప్పుడెందుకనో ఆ స్పీడు లేకపోవడానికి కారణం కూడా పదవి ఒక్కటే కాదని, జగన్ తో పెరిగిన దూరం కూడా ఓ కారణమని తెలుస్తోంది. ఆ విధంగా చంద్రబాబుపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం కూడా కొంత వరకూ కెరియర్ కు ఇబ్బందేనని ఇప్పుడు గుర్తించారా?
ఒంటరి వాడిని నేను ఎవ్వరి వాడిని కాను అని పాడుకుంటున్నారు కొడాలి నాని.. అనే మాజీ మంత్రి. గుడివాడ కేంద్రంగా ఆయన ఇప్పుడు రిలాక్స్ అయి ఉన్నారు. ఎక్కడికీ బయటకు రావడం లేదు. అప్పటి మాదిరిగా దుందుడుకు స్వభావంతో లేరు. కాస్త తగ్గారా అన్న అనుమానాలకు బలం చేకూరుస్తూ ఆయన నిశ్శబ్దం అయిపోయారు. ఓ విధంగా ఆయనతో పాటు తాజా మాజీలు అంతా దాదాపు ఆ విధంగానే ఉన్నారు. వారంతా ఎలా ఉన్నా తనకు మంత్రి పదవి ఒక్కటే అడ్డు అని అది లేకపోతే ఎవ్వరినైనా తాను ఎదుర్కొని విశ్వ రూపం చూపిస్తానని చెప్పిన నాని ఇప్పుడు డీలా పడిపోయారు. తన స్వభావానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ అందరినీ ముఖ్యంగా వైసీపీ శ్రేణులందరినీ విస్మయ పరుస్తున్నారు.