ఇంతవరకూ హైకోర్టుకు ప్రభుత్వం ఏం చెబుతూ వస్తుందో అదే మాట ఓ వందో సారి చెప్పింది నిన్నటి వేళ. అంటే ఇక అమరావతిపై ఆశలు పూర్తిగా వదులుకోవాలి అన్న రీతిలో రైతులకు ఓ సందేశం ఇచ్చింది. కోర్టు తీర్పు పాటింపుపై ఇప్పటికే ఏ స్పష్టతా ఇవ్వని ప్రభుత్వం తాజాగా రాజధాని నిర్మాణం ఈ టెర్మ్ లో జరగదని తేల్చేసింది. ఈ మాట నేరుగా చెప్పకపోయినా చంద్రబాబు హయాంలో జరిగిన నిర్మాణాల కొనసాగింపు అన్నది ఇప్పటికిక జరిగేదే లేదని పరోక్షంగానే సంకేతాలు ఇచ్చి అందరినీ మరో సారి దిగ్భ్రమలో నెట్టేసింది.
మూడు రాజధానుల జపం చేస్తున్న ఏపీ సర్కారు ఉగాది వేళ ఓ మంచి ఆసక్తికర విషయం చెప్పింది. ఆ మాట విన్నాక మళ్లీ రాజధాని రైతులు ఉద్యమాలకు ఆరంభం ఇచ్చేలానే ఉన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న విషయాన్నే మళ్లీ పెండింగ్ లో పెడుతూ కోర్టుకో వివరణను అఫిడవిట్ రూపంలో ఇవ్వడం జగన్ కే చెల్లు అన్న అభిప్రాయం ఒకటి విపక్షం నుంచి వినిపిస్తోంది.
కోర్టు చెప్పిన మాటలకు ప్రత్యామ్నాయంగా న్యాయ సంబంధ పరిష్కారం ఏ మయినా ఉందా అని తాము వెతుకుతున్నామని కూడా అఫిడవిట్ పేర్కొన్నారని ప్రధాన మీడియా చెబుతోంది. ఈ లెక్కన చూసుకుంటే మరో ఐదేళ్లు ఆగినా కూడా అమరావతి పనులు ముందుకు పోయేందుకు ఆస్కారం లేదని తేలిపోయింది. ఎప్పటిలానే పాత పాట పాడుతూ కాలయాపనకు ప్రాధాన్యం ఇస్తూ తప్పించుకునే ధోరణిలో వైసీపీ తిరగడం ఖాయమని కూడా స్పష్టం అయింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన గొడవ మళ్లీ మొదటికే వచ్చింది. ఆ రోజు చెప్పిన విధంగా నెల రోజుల్లో రాజధాని పనులు పూర్తి కావని హై కోర్టుకు విన్నవించింది రాష్ట్ర ప్రభుత్వం. తమకు నెల రోజులు చాలదని అరవై నెలలు కావాలని కోరుకుంటోంది. దీంతో ఈ కథ మొదటికే వచ్చింది. అంతా ఊహించిన విధంగానే రాజధాని పనులలో వేగం ఇప్పట్లో పుంజుకోవడం కష్టం అని తేలిపోయింది. న్యాయ నిపుణులు కూడా ప్రస్తుత ప్రభుత్వానికి రాజధాని పనులు చేపట్టడం అన్నది ఇష్టం లేని వ్యవహారంగానే ఉందని, అందుకే తీవ్ర కాలయాపనే లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొంటూ ప్రధాన మీడియాలో తమ అభిప్రాయాలు వెల్లడించారు. మార్చి 3 న వెల్లడించిన తీర్పు ప్రకారం నెల రోజుల్లో మౌలిక వసతుల కల్పన చేయాల్సి ఉంది. మూడు నెలలలో అభివృద్ధి చేసిన రాజధాని ప్లాట్లను రైతులకు అందించాల్సి ఉంది. ఆరు నెలలో రాజధాని పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇవేవీ ఇప్పట్లో తేలేవే కావని తేలిపోయింది. దీంతో సీఎస్ సమీర్ శర్మ ఇచ్చిన అఫిడవిట్ ఎన్నో సందేహాలకు తావిస్తోంది.