ఆంధ్రావని రాజకీయాలు పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణ కన్నా భిన్నంగా ఉన్నాయి. ఒకప్పుడు ఓ మోస్తరు నియంత్రణతో మెలిగే నాయకులు కూడా ఇవాళ రెచ్చిపోయి రంకెలు వేస్తున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా అధికారులపై మాత్రం రంకెలు వేస్తున్నారు. వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో నియంత్రణ కోల్పోయి ఆ రోజు హరీశ్ రావుతో సహా ఇతరులు పోలీసులపై అరిచిన సందర్భాలు, కేసులు వేసిన సందర్భాలు సంయమనం కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. కాలగతిలో హరీశ్ రావు తగ్గారు. ఆరోజు ఓ అధికారిని కొట్టిన మందా జగన్నాథం రాజకీయంగా ఉనికిలోలేకుండానే పోయారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నా కూడా పెద్దగా రాణించలేకపోతున్నారన్న వాదన కూడా ఉంది.
ఆయన కూడా ఒకప్పుడు స్పీడుగానే ఉండేవారు. ఆయన తరువాత టీఆర్ఎస్ లో మల్లారెడ్డి, బాల్క సుమన్ లాంటి నేతలు వివాదాలకు తావిచ్చేలానే ఉన్నారు. వీరితో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్, బీజేపీ బాస్ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ వీళ్లంతా వివాదాలకు కారకులే. ఒకనాడు విద్వేషంతో మాట్లాడిన కేసీఆర్ తరువాత తగ్గారు. రెండు సార్లు అధికారంలో వచ్చి ఆంధ్రులను ఆయన చెప్పిన విధంగానే ఉద్యమ సమయంలో మాట ఇచ్చిన ప్రకారమే కడుపులో పెట్టుకుని దాచుకున్నారు. ఆ విధంగా కేసీఆర్ సెటిలర్లపై ప్రేమ ను కనబరుస్తూనే ఉన్నారు.
కానీ ఇక్కడ అంటే ఆంధ్రాలో మంత్రులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు దానం నాగేందర్ (ఇప్పుడు తెలంగాణ లీడర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే) కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏ విధంగా రౌడీయిజం చెలాయించారో అదేవిధంగా కొడాని నాని అనే మంత్రి ప్రవర్తిస్తున్నారన్న విమర్శ ఒకటి రాజకీయ పరిశీలకుల నుంచి వస్తోంది. ఇదే విధంగా భాష విషయంలో కట్టుతప్పి మాట్లాడుతున్న వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీదిరి అప్పల్రాజు ఉన్నారు. ఇదేస్థాయిలో మరికొందరు వివాదాస్పదులవుతున్నారు. ఆఖరికి వీరి నడవడి గమనిస్తే వీరు మంత్రులా లేక రౌడీలా అన్న విధంగా అనుమానాలు వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు.