రాజకీయం ఎలా ఉన్నా గెలుపు ఒక్కటే ప్రధానం కావాలి. అందుకు హిందుత్వం అన్నది ఓ ప్రధాన మార్గం. హిందూ మత విశ్వాసాలు వర్థిల్లే చోటు వారణాసి మరియు కాశీ పుర క్షేత్రం కనుక ఇక్కడ రాజకీయం అంతా ప్రధానంగా సున్నిత భావోద్వేగాల చుట్టూ పరిభ్రమిస్తుంది. అందుకే బీజేపీ కానీ సమాజ్ వాదీ పార్టీ ఆఖరికి కాంగ్రెస్ కానీ వీటి చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. ఆఖరికి బాబాల జయంతులను కూడా ప్రాధాన్యాంశాలుగా తీసుకుని వారి ఆశ్రమాల చుట్టూ ఈసారి మోడీ కానీ రాహుల్ కానీ ప్రదక్షిణలు చేసిన వైనం విస్మరించలేం.
ఈ కోవలో అయోధ్య రామాలయం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రతి ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడా సుస్పష్టం అయిన రీతిలోనే ప్రభావం చూపి, మోడీని కానీ రాహుల్ కానీ జూనియర్ ములాయం ( అఖిలేశ్ యాదవ్) ను కానీ ఓ మెట్టు పైన ఉంచడమో లేదా ఓ మెట్టు కిందకు దించడమో చేయడం ఖాయం. ఇప్పటిదాకా ఏడు విడతల పోలింగ్ లో రెండు విడతలు మినహా మిగతా విడతలన్నీ ఎటువంటి అల్లర్లూ లేకుండానే ప్రశాంతంగానే ముగిశాయి. చివరి రెండు విడతలే విజేతలను నిర్ణయించే దశలో ఉంటాయని ప్రధాన స్రవంతిలో ఉన్న మాధ్యమాలు చెబుతున్నాయి.
అయోధ్య అసెంబ్లీ స్థానం అన్నది ఇక్కడ ప్రధాన పార్టీలకు కీలకం అన్నది సుస్పష్టం. ఇక్కడ బీజేపీ తరఫున వేద ప్రకాశ్ గుప్తా బరిలో ఉన్నారు అని, ఈయనకు పోటీగా సమాజ్ వాదీ పార్టీ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన ప్రతినిధి పవన్ పాండేను ఉంచిందని ఇదే ప్రధానం అయిన ఎత్తుగడ అని మీడియా అంటోంది. బీజేపీ మతతత్వ రాజకీయం తప్ప మరొకటి చేయడం లేదని ఎద్దేవా చేసే పార్టీలు ఈసారి ఇవి కూడా హిందుత్వ నినాదాన్ని బలీయంగానే వినిపించాయి కనుక ఇవాళ తప్పంతా కమల నాథులదే అని చెప్పలేం.
బీజేపీ తరఫున బరిలో ఉన్న వేద ప్రకాశ్ గుప్తా సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఆయనపై వ్యతిరేకత ఉన్నా మోడీ ఇమేజ్, యోగీ ఇమేజ్ పైనే ఆయన ఆధారపడి ఉన్నారని కూడా ప్రధానంగా మీడియా చెబుతున్న మాట. అదే కనుక జరిగితే ఈ సారి బీజేపీ బీజియం అయోధ్యలో ఘంటాపథంగా మోగడం ఖాయం.