తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఒక్కొక్కటిగా వస్తోన్నాయి. ఎన్నికలు వస్తున్న వేళ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. అయితే… తాజాగా రాష్ట్రంలో మెడికల్ విద్య పూరి చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అయితే దీనిపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. తెలంగాణ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల వర్షం కురుస్తోందని హరీశ్‌రావు అన్నారు. మెడికల్ ఎడ్యుకేషన్‌లో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసిందని హరీశ్‌రావు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆరోగ్యతెలంగాణ అనే హ్యాష్‌ట్యాగ్‌తో హరీశ్‌రావు ట్వీట్ చేశారు.
రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన విషయం విదితమే. అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 20న ఉదయం 10:30 గంటల నుంచి జనవరి 5వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. మొత్తం 34 విభాగాల్లో 1147 పోస్టులను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 44 ఏండ్ల మధ్య వయసున్న వారే దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 1147 పోస్టుల్లో అధికంగా అనస్థీషియాలో 155, జనరల్ సర్జరీలో 117, జనరల్ మెడిసిన్‌లో 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.