తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావు దూకుడు ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. టిఆర్‌ఎస్‌కు వన్ ఆఫ్ ది పిల్లర్‌గా ఉంటూ హరీష్…తన సత్తా ఏంటో ప్రత్యర్ధులకు చూపిస్తూ ఉంటారు. ఎక్కడ పార్టీ ఇబ్బందుల్లో ఉంటే అక్కడకు ఎంట్రీ ఇచ్చి, పార్టీని పైకి లేపడానికి చూస్తారు. అయితే ఈ ప్రాసెస్‌లో హరీష్ అసలు లాజిక్‌లు లేని రాజకీయం అయితే చేయరు. తాను ప్రత్యర్ధులపై చేసే ప్రతి విమర్శకు అర్ధం ఉంటుంది.
కానీ ఈ మధ్య ఏమైందో గానీ హరీష్ కూడా లాజిక్ లేకుండా విమర్శలు చేసేస్తున్నారు. ఏదో ప్రత్యర్ధులు విమర్శలు చేస్తున్నారు…మనం కూడా ఏదొకటి అనేయాలని అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ని ఓడించడానికి హరీష్ చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు…ఆయనకు ఎక్కడకక్కడే చెక్ పెట్టాలని చూస్తున్నారు. అటు ఈటల కూడా హరీష్ వ్యూహాలకు చెక్ పెడుతూ వెళుతున్నారు. ఈ క్రమంలో ఈటల-హరీష్‌ల మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతుంది.
తాజాగా ఈటల…కేసిఆర్, హరీష్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ఈ విమర్శలకు హరీష్ కౌంటర్ ఇస్తూ… కేసీఆర్‌పై ఈటల అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, రాజకీయ ఓనమాలు నేర్పిన వ్యక్తినే ఘోరీ కడతానంటావా అని ఫైర్ అయ్యారు. అలాగే ఓసీల్లో పేదలకు కూడా పథకాలు ఇస్తున్నామని, అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించామని, కేంద్రం ప్రవేశపెట్టిన జిఎస్‌టి వల్ల ఎంతమంది వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారో తెలుసని మాట్లాడారు.
అయితే ఇక్కడ హరీష్ పూర్తిగా లాజిక్ మిస్ అవుతున్నారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం…దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, ఇక జిఎస్‌టిని గతంలో టిఆర్‌ఎస్ కూడా సమర్ధించింది…రాష్ట్రం సైతం ట్యాక్సులు ఎలా వసూలు చేస్తుందో అందరికీ తెలుసు. కాబట్టి హరీష్ అందరి నాయకులే మాదిరిగా తయారైపోయి, గుడ్డిగా విమర్శలు చేసేస్తున్నట్లు కనిపిస్తోంది.