హుజరాబాద్ నియోజకవర్గం లో సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అభివృద్ధిపై చర్చకు రావాలని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు సవాల్ విసిరారు. ఈటలకు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలన్నారు. అయితే చర్చకు ఈటల అవసరం లేదని.. కౌశిక్ రెడ్డి స్థాయికి తాము వస్తామని బిజెపి నేతలు ప్రతి సవాల్ విసిరారు. దీంతో హుజరాబాద్ లో పోటా పోటీగా టిఆర్ఎస్, బిజెపి పార్టీల ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి.
అయితే చర్చకు వెళుతున్న బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డిని, ఇతర నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. చర్చకు వెళుతున్న తమను కావాలనే పోలీసులు అడ్డుకుంటున్నారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇక హుజురాబాద్ లోని టిఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ చౌరస్తాకు ర్యాలీగా వెళ్లేందుకు కౌశిక్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో అంబేద్కర్ చౌరస్తాలో భారీగా పోలీసు బలగాలు మొహరించాయి.