తెలంగాణలో గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండిపోయి కట్టలు తెగుతున్నాయి. దీంతో వరద నీరు గ్రామాల్లోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అయితే.. ఎగువన సైతం భారీ వర్షాలు కురుస్తుండడంతో జలశయాలకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. గోదావరి నదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో.. ఉగ్రరూపం దాల్చింది. దీంతో భద్రాచలంలో ప్రమాదకరస్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. గోదావరి నీటిమట్టం 67 అడుగులకు చేరుకుంది. గోదావరిలోకి 21 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. ముందస్తుగా ఊహించినట్లే 73 అడుగులు దాటే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
భద్రాచలం టౌన్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం మరో 48 గంటలు చాలా కీలకమైన సమయం అంటున్నారు ఉన్నతాధికారులు. ఈ నేపథ్యంలో.. భద్రాచలం గోదావరి బ్రిడ్జిపై పూర్తిగా రాకపోకలను నిలిపివేశారు అధికారులు. ఇప్పటికే 2 వేల కుటుంబాలను పునరావసర కేంద్రాలకు తరలించిన అధికారులు.. 36 ఏళ్ల తర్వాత గోదావరి నీటిమట్టం భద్రాచలంలో మళ్లీ 70 అడుగులు దాటుతున్నట్లు తెలిపారు. 1986 తర్వాత ఆ స్థాయిలో గోదావరికి మొదటిసారి వరద పోటెత్తినట్లు అధికారులు చెబుతున్నారు.