ఎండల భగభగలతో చెమటలు కక్కుతున్న జనాలకు కొంత ఉపశమనం కలిగింది. సోమవారం వేకువజామున హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షం కురియడంతో చెట్లు నెలకొరిగాయి. మామిడికాపు నేలరాలింది. దీంతో మామిడి రైతు కన్నీరు పెడుతున్నాడు. అంతేకాకుండా ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షాలు కురిశాయి. అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు విక్రయించేందుకు తీసుకువచ్చిన ధాన్యం రాశులు తడిసి ముద్దవడంతో.. ఆరు గాలం శ్రమించిన కష్టం నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.
అయితే ఆదివారం సాయంత్రం నుంచే వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేటి నుంచి వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ శాఖ సూచించింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు జల్లులు కురిశాయి. జూబ్లీహిల్స్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది.