సీతామాతా అవతారం చాలించిన ప్రదేశం మీకు తెలుసా !

-

రామాయణం.. అంతా సీతమాత చుట్టూ తిరుగుతుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి సీతమ్మగా అవతారం దాల్చిందని పెద్దలు చెప్తారు. రామాయణంలో చివరి ఘట్టం సీతమ్మ తనువు చాలించడం. ఆ విచారకరమైన, పవిత్రమైన ప్రదేశం ఎక్కడ ఉంది. దాని విశేషాలు ఏమిటో తెలుసుకుందాం….

సీతమ్మ తనువు చాలించిన ఆ పవిత్ర స్థలం ఎక్కడో కాదు .. అలహబాద్ మరియు వారణాసిలను కలిపే రెండవ జాతీయ రహదారికి సుమారు 4 కి. మీ. దూరంలో దక్షిణాన ఉంటుంది. రెండో జాతియ రహదారి పైన ఉన్న జంగిగంజ్ నుండి 14 కి.మీ ప్రయాణం చేస్తే అక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఆ ప్రదేశాన్ని ‘సీత సమాహిత్ స్థల్’ అని ‘సీత మారి’ అని పిలుస్తారు. సీతా సమాహిత్ స్థల్ లో చూడటానికి ఒకే ఒక గుడి ఉన్నది. సీతాదేవి తన అవతారం చాలించినప్పుడు తన మాతృమూర్తి అయిన భూమాతలో ఐక్యం అయ్యిందన్న విషయం అందరికీ తెలుసు కానీ ఆ ప్రదేశం ఎక్కడుందో చాలా మందికి తెలియదు… ఆ ప్రదేశం తమసా నది పరిసర ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో 90వ దశకంలో నిర్మించిన అందమైన స్మారక కట్టడం ఒకటుంది.

ఈ స్మారక కట్టడం నిర్మాణం జరుగక ముందు ఇక్కడ అమ్మ వారి జుట్టుని తలపించేట్టుగా కేశ వాటిక ఉండేదని అక్కడి స్థానికులు చెబుతారు. అక్కడ మొలిచిన గడ్డి ని పశువులు కూడా తినేవి కాదట. స్మారకాన్ని నిర్మించేటప్పుడు ‘సీతా కేశ వాటిక’ ను పాడు చెయకుండ అలాగే ఉంచారు. స్మారకం ఉన్న ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉన్నది. ఈ ఆశ్రమంలోనే జానకి దేవి మళ్లీ అడవుల పాలైనప్పుడు నివాసము ఉండేది. ఆశ్రమానికి పక్కనే లవ కుశలకు జన్మనిచ్చిన స్థలం అయిన సీత వటవృక్షం కూడ ఉంటుంది. ఇక స్మారకం విషయానికి వస్తే, అది ముచ్చటగా రెండు అంతస్థుల నిర్మాణం. పై అంతస్తులోని అద్దాల మంటపం లో అమ్మ వారి పాల రాతి విగ్రహం ఉంటుంది. అలాగే కింద భాగంలో జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకుంటున్నట్టుగా చూపిస్తున్న అమ్మ వారి ప్రతిమ ను చూస్తుంటే …. ఎంతటి వారికైన బాధ కలిగించే విధంగా ఉంటుంది. వెనక గోడల మీద ఆ సంఘటనలను చూపిస్తున్న సన్నివేశపు శిలా చిత్రం కనిపిస్తుంది.

సార్మరక మందిరం !

గుడి లేదా స్మారక వివరాల్లోకి వెళితే, దీన్ని స్వామి జితేంద్రానంద తీర్థులవారి ఆదేశం మేరకు ఇక్కడ నిర్మించారు. సన్యాసం స్వీకరించిన ఆయన ఋశికేష్ ఆశ్రమంలో కాలం గడుపుతుండగా, దేవి అనుగ్రహం మేరకు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి కాలినడకన బయలుదేరి చేరుకుంటాడు. అప్పుడు ఆయన ఈ స్థలంలో స్మారకం నిర్మించాలని పరితపించి దాతలందరినీ కలుస్తాడు. చివరికి ప్రకాశ్ పున్జ్ గారి సాయంతో కల నెరవేర్చుకుంటారు తీర్థుల వారు.

ఆలయం పక్కనే జీవకళ ఉట్టిపడే విధంగా తీర్థులవారి సమాధి ఉన్నది. ఇక్కడ సీతమ్మతో పాటు శివుని విగ్రహం, 20 అడుగుల కృత్రిమ రాతి పై నిర్మించిన 108 అడుగుల హనుమంతుడు కూడ ఉన్నాడు . ఈ రాతి నిర్మాణం కింద గుహలో చిన్న హనుమన్ దేవాలయం ఉంటుంది. సీతా సమాహిత్ స్థల్ చేరుకొను మార్గం సీతా సమాహిత్ స్థల్ కి బస్సు మార్గం ఉంది. అలహాబాద్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో, వారణాసి నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పుణ్య క్షేత్రం. రైళ్లలో వచ్చే వారు అలహాబాద్ లేదా వారణాసి (ఏది దగ్గర అనుకుంటే అది) రైల్వే స్టేషన్ లో దిగి సీతా సమాహిత్ స్థల్ చేరుకోవచ్చు. వారణాశి, అలహాబాద్‌ నుంచి ఇక్కడకు చేరుకోవడం సులభం.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version