ఆ నియోజకవర్గంలో హోటల్స్ కి ఇప్పుడు ఫుల్ డిమాండ్…!

దుబ్బాక ఉప ఎన్నికతో సంగారెడ్డి జిల్లాలో ఎటు చూసినా ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. తమ అభిమాన నేతలు, పార్టీని గెలిపించుకోవడానికి అన్ని పార్టీల నాయకులు వాలిపోతున్నారు. ప్రచారంలో తమవంతుగా ఓ చెయ్యి వేస్తున్నారు. ప్రధాన పార్టీల తరపున అగ్ర నేతలు సైతం ఇక్కడే ఉండటంతో హోటల్స్, లాడ్జీల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది, ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న రూములు సైతం ఇప్పుడు నిండిపోతున్నాయి. సిద్దిపేట నుంచి దుబ్బాక 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ కూడా పరిస్థితి అలానే ఉంది. రెస్టారెంట్లు లాడ్జీలు,హోటల్స్ అన్ని హౌస్‌ఫుల్ అయిపోయాయి.


ఎక్కడెక్కడి నుంచో వచ్చిన నేతలు ఇక్కడే తిష్ట వేయడంతో హోటల్స్ ముందు హౌజ్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్ సమయంలో ఈగలు తోలుకున్న హోటల్, లాడ్జీల యజమానులకు ఇప్పుడు ఫుల్ గిరాకీ తగిలింది. ఎన్నికల పుణ్యమా అని నష్టాన్ని విధంగా కవర్ చేసుకుంటున్నారు వ్యాపారులు. అనుకోని అతిథిలా వచ్చిన ఎన్నికలతో ఫుల్ జోష్ నిండింది. ఏసీ, నాన్ ఏసీ అని తేడా లేదు . దొరికిందే చాలు అని వెంటనే రూము బుక్ చేసుకుంటున్నారు. దుబ్బాకలో ఇళ్లకు కూడా అదేవిధంగా క్రేజ్ పెరిగింది. ఒక్కటంటే ఒక్క నెల అద్దెకిస్తే చాలంటూ.. వెంటబడుతున్నారు. స్థాయిని బట్టి రాష్ట్ర స్థాయి నేతలకి ఒకలా.. జిల్లా స్థాయి నేతలకి ఒకలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు స్థానిక నాయకులు.