రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు చేయడానికి శని, ఆదివారాల్లో నవంబర్ 6,7వ తేదీ లలో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించాలని నిర్ణయించింది. అదేవిధంగా ఈ నెల 27,28 తేదీలలో కూడా స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. భారత ఎన్నికల సంఘం నవంబర్ 1న 2022 ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. అయితే అదే రోజున రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ఓటర్ల జాబితా పై రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఈ నెల 30వ తేదీ వరకు ముసాయిదా ఓటర్ల జాబితాలో మార్పులు చేసేందుకు… అవసరమనుకుంటే కొత్తగా నమోదు చేసేందుకు అవకాశం కల్పించారు.
ఈ నేపథ్యంలోనే ఈనెల 6,7, 27, 28 తేదీల్లో శని ఆదివారాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసి కమిషనర్ తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లను ఎన్నికల కమిషన్ అధికారులు ఆదేశించారు. ఓటరు కార్డుల్లో మార్పుల కోసం వచ్చిన దరఖాస్తులను డిసెంబర్ 20వ తేదీ వరకు పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. అదే విధంగా వచ్చే ఏడాది జనవరి 5, 2020 సంవత్సరానికి తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నారు. ఈ షెడ్యూల్ మేరకు రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లు బాధ్యతలు తీసుకొని పని చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.
18 ఏళ్లు నిండిన వారు నూతన ఓటర్ కార్డు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని ఓటరు జాబితాలో నూతన ఓటరు నమోదు చేసుకోవడానికి ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. అదేవిధంగా ఓటరు జాబితా నుండి పేరునను తొలగించేందుకు నమోదైన వారు ఫారం-7 ద్వారా…. ఓటరు జాబితాలో తప్పులను సరి చేసుకోవడం కోసం ఫారం 8 ద్వారా…ఓటరు జాబితాలో మార్పులు చేసుకోవడానికి 8ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా అనే www.nvsp.in లేదా www.ceotelangana.nic.in వెబ్సైట్ల ద్వారా కూడా ఓటరు నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది.