ఇంటి నుంచి కరీంనగర్ బయలుదేరిని ఈటెల రాజేందర్…

హుజూరాబాద్ ఎన్నికల్లో విజయం దాదాపు ఖరారు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ సంబరాలు మొదలయ్యాయి. మరోవైపు విజయం ఖరారు కావడంతో ఈటెల రాజేందర్ హుజూరాబాద్ లో తన ఇంటి నుంచి కరీంనగర్ కౌంటింగ్ కేంద్రానికి తరలివెళ్లారు. ఈటెల సతీమణి జమును వీర తిలకం దిద్దిన తర్వాాత కరీంనగర్ కు బయలుదేరారు. ఉదయం నుంచి ఇంటికే పరిమితమైన ఈటెల రాజేందర్ గెలుపు నిశ్చయమవడంతో కౌంటింగ్ కేంద్రానికి వెళ్లినట్లు తెలుస్తుంది. గెలుపు అనంతరం రిటర్నింగ్ అధికారి నుంచి గెలుపును ధ్రువీకరిస్తూ ఇచ్చే సర్టిఫికేట్ ను తీసుకోనున్నారు. ఈటెల గెలుపు ఖాయం కావడంతో ఆయన ఇంటికి అభిమానులు, కార్యకర్తలు పోటెత్తారు.

అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉండటంతో కార్యకర్తలు, అభిమానులకు పోలీసులు అనుమతి ఇవ్వమని చెబుతున్నారు. మరోవైపు గెలుపు అనంతరం ర్యాలీలు, విజయోత్సవాలకు ఈసీ నుంచి అనుమతి లేదు. మరోవైపు ఈటెల గెలుపును పురస్కరించుకుని చాలా మంది అభిమానులు కరీంనగర్ కు వస్తున్నారు. అయితే వీరిని ఎక్కడిక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో గెలుపు అనంతరం పోలీసులకు, ఈటెల అభిమానులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం తలెత్తే ప్రమాదం ఏర్పడింది.