హుజూరాబాద్ ప్రచారానికి నేటితో తెర..

దాదాపుగా గత ఐదు నెలలుగా జరుగుతున్న హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడనుంది. ఈనెల 30న ఓటింగ్ జరుగనుంది. ఓటింగ్ కు 72 గంటల ముందే ప్రచారం ముగియనుంది. గతంలో ప్రచారం ముగింపు ఓటింగ్కు 48 గంటల ముందు ఉండేది. అయితే కోవిడ్ నిబంధనల కారణంగా ఈ సారి ప్రచారం మరింత ముందుగానే ముగియనుంది. సాయంత్రం 7 గంటల తర్వాత హుజూరాబాద్లో మైకులు మూగబోనున్నాయి. స్థానికేతర నేతలు హుజూరాబాద్ ను వీడనున్నారు. పోలింగ్ జరిగే సమయం దాకా హుజూరాబాద్ పరిధిలో వైన్ షాపులు మూసివేయనున్నారు.

 కాగా చివరి రోజుల్లో బైపోల్ లో ప్రచారాన్ని అన్ని పార్టీలు హోరెత్తించాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. హుజూరాబాద్లో గెలిస్తే ఏం చేస్తారనే విషయాన్ని ప్రజల ముందుంచారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రధాన నాయకులు తమ అభ్యర్థుల తరుపున ప్రచారం చేశాయి. స్టార్ క్యాంపెనర్లతో ప్రచారాన్ని హోరెత్తించాయి. చివరి రోజు ప్రచారానికి మరిన్ని గంటలే ఉండటంతో పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రచారానికి తెర పడటంతో ప్రలోభాలకు తెర లేచే అవకాశం ఉంది.