హుజురాబాద్‌లో టీఆరెస్‌కు భారీ షాక్

కరీంనగర్: హుజురాబాద్‌లో టీఆరెస్‌కు భారీ షాక్ తగిలింది. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌పై ఈటల రాజేందర్ ఎఫెక్ట్ బాగా పడింది. ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ వ్యవహరించిన తీరును స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు కీలక నేతలు ఒక్కసారిగా రాజీనామాలు చేశారు. వీణవంక మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజీనామా చేశారు. వైస్ ఎంపీపీ సహా ఏడు గ్రామాల సర్పంచులు కూడా రాజీనామా చేశారు. అంతుకాదు ఎంపీటీసీ‌ల ఫోరమ్ అధ్యక్షుడు సహా 8 గ్రామ శాఖల అధ్యక్షులు కూడా టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు. ఈటలకు మద్దతుగా వీణవంకలో భారీ ప్రదర్శన నిర్వహించారు.

హుజురాబాద్‌లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేపట్టిన టీఆర్ఎస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.  హుజురాబాద్‌లో టీఆర్ఎస్ నేతలు రాజేందర్‌తో వెళ్లకుండా ఉండేందుకు మంత్రి గంగుల కమలాకర్ చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి. హుజురాబాద్ టీఆర్ఎస్ నేతలను కలిసిన ఆయన.. ఎవరూ ఈటలతో వెళ్లకూడదని సూచించారు. అయినా ఫలితంలేకుండా పోయింది. నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. మరి టీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరోవైపు ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలను కలిశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.