ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్న దృష్ట్యా వాటి నివారణకు తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడమే గాక.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటూ ప్రమాదాల నివారణకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులు కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చి ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి షాక్ ఇస్తున్నారు.
హైదరాబాద్లో మూడు నెలల వ్యవధిలో మూడుసార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు గట్టి ఝలక్ ఇస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి 400 శాతం అదనంగా జరిమానా విధిస్తూ వాహనదారుల్లో భయం పెంచుతున్నారు. గతంలో హెల్మెట్ లేకపోతే రూ.100 జరిమానా. ప్రస్తుతం 3 నెలల వ్యవధిలో హెల్మెట్ లేకుండా మూడుసార్లు పట్టుపడితే మొదటిసారి రూ.100 రెండోసారి రూ.200 మూడోసారి రూ.500 జరిమానా వేస్తున్నారు. వాహనదారులకు నిబంధనల ఉల్లంఘనల అమలు విషయంలో చైతన్యం తీసుకురావడం కోసమే ఇలా చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
ఇతర ఉల్లంఘనలకు సంబంధించి కూడా ఇదే తరహాలో వడ్డిస్తున్నారు. వారం రోజులుగా ఇలా దాదాపు 50 వేలమంది వాహనదారులపై ఇప్పటికే జరిమనాను విధిస్తూ చలాన్లు జారీ చేసినట్లు క్షేత్రస్థాయిలో విధులను నిర్వహిస్తున్న పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మొదటిసారి వేసిన చలానాకు సంబంధించి జరిమానా మొత్తం చెల్లిస్తే అలాంటి వారికి విధించడం లేదు.