ఎమ్మెల్యే గాదరి కిషోర్‌.. ఈ సారి గెలిస్తే.. మంత్రి పదవే..!

-

ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఇప్పటికే రెండు సార్లు ఏకధాటిగా గెలుపొంది… ముచ్చటగా మూడోసారి తుంగతుర్తి గడ్డపై హ్యాట్రిక్ రూపేనా గెలిపిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి లభించడం ఖాయమని మంగళవారం తుంగతుర్తిలో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమ్మేళన సమావేశంలో పలువురు ముక్తకంఠంతో పేర్కొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 12 తీర్మానాలపై 25 మంది ప్రముఖులతో జరిగిన ప్రతిపాదన, బలపరిచే అంశాలపై జరిగిన కార్యక్రమాలపై హ్యాట్రిక్ కొట్టడం, మంత్రి పదవి పొందడం లాంటి అంశాలపైనే ప్రసంగాలు జరిగాయి. ముఖ్యంగా ప్రతిపాదన తీర్మానాల కంటే కిషోర్ ను గెలిపిస్తే మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుంది అనే అంశంపైనే ప్లీనరీలో అందరి నోట ప్రధాన ప్రసంగమైంది. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి లతో కిషోర్ కు అత్యంత దగ్గరి సంబంధాలు ఉండడం మూలంగా మంత్రి పదవి లభిస్తుందని ముక్తకంఠంతో వారంతా ఎలుగెత్తారు. ఈ అంశంతో ప్లీనరీకి హాజరైన వేలాది మంది హర్షద్వనాల మధ్య సమ్మతి సంకేతాలను వ్యక్తం చేశారు.

ఎస్సీ రిజర్వుడుగా కొనసాగుతున్న తుంగతుర్తి అసెంబ్లీ గడ్డపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏకచత్రాధిపత్యంగా రెండు మార్లు (2014,2018) కిషోర్ విజయం సాధించారని, ఈ మేరకు త్వరలో జరగబోయే ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడితే మంత్రి పదవి లభించడం ఖాయమని వారంతా స్పష్టం చేశారు. కిషోర్ ఆధ్వర్యంలో గత 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి చారిత్రాత్మకంగా నిలిచిందని వివరించారు. మూడోసారి గెలిస్తే తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు. ముఖ్యంగా ఇప్పటికే కిషోర్ గెలుపు ఖాయమైన సంకేతాలు వెలువడినప్పటికీ ప్రధానంగా 50వేలపై మెజార్టీ పైనే క్యాడర్ దృష్టి సారించాలని వారంతా పునరుద్గాటించారు.దీంతో స్పందించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్ తాను మూడోసారి గెలిస్తే మంత్రి పదవి ఖాయమని స్పష్టం చేశారు. జిల్లాలో జగదీశ్వర్ రెడ్డితో పాటు తాను మంత్రులుగా ఉంటామని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ చెంప చెల్లుమనే విధంగా ధీటుగా సమాధానాలు ఇవ్వాలని క్యాడర్ కు ఆయన పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version