అశ్లీల చిత్రాల కేసులో పోలీసుల విచారణను ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రా భార్య, నటి శిల్పాశెట్టి కొన్ని మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె పిటిషన్‌ను శుక్రవారం బాంబే హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా శిల్పాశెట్టికి కోర్టు పలు సూటి ప్రశ్నలు వేసింది.
పోలీసులు ఇస్తున్న సమాచారం ఆధారంగానే మీడియా సంస్థలు వార్తలు రాస్తున్నాయని, కథనాలను ప్రసారం చేస్తున్నాయని, అందులో తప్పేముందని.. కోర్టు శిల్పాశెట్టిని ప్రశ్నించింది. మీరు పబ్లిక్ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు ? ఈ విషయాలు పబ్లిక్ అందరికీ తెలిస్తే తప్పేముంది ? అందరికీ తెలిసిన విషయాలే కదా, దీనిపై పరువు నష్టం ఎలా వేస్తారని కోర్టు శిల్పాశెట్టి లాయర్‌ను ప్రశ్నించింది.
ఇక యూట్యూబ్‌లో ఓ చానల్ ప్రసారం చేసిన వీడియోను చూపిస్తూ శిల్పాశెట్టి లాయర్ వాదించగా.. కేవలం ఒక్క వీడియో ఆధారంగా అందరిపై ఎలా పరువు నష్టం వేస్తారని కోర్టు ప్రశ్నించింది. తప్పుడు వార్తలు రాస్తే, కథనాలను ప్రసారం చేస్తే చర్యలు తీసుకోవచ్చని కోర్టు తెలిపింది. అలాంటి వివరాలతో రావాలని కోర్టు సూచించింది. ఈ క్రమంలో ఆమె పిటిషన్ ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది.