సోమవారం తాడేపల్లి ప్యాలెస్ లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజినల్ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ ఇన్చార్జిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. క్యాంపు కార్యాలయం తన నియోజకవర్గ పరిధిలో కూతవేటు దూరంలో ఉన్న కొంతకాలంగా ఆయన అటువైపే వెళ్లడం లేదని, జగన్ తో విభేదాలు రావడమే దీనికి కారణమని వార్తలు వెలువడ్డాయి.
ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు రావడంతో తాను ఎందుకు హాజరు కాలేకపోయానో పార్టీకి తెలియజేశానని చెప్పారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. పలు అనారోగ్య కారణాలు, ఇంట్లో ఫంక్షన్ ఉండడం కారణాల వల్ల నిన్నటి సమావేశానికి హాజరు కాలేదని చెప్పారు. అలాగే వైసిపి అధిష్టానానికి, తనకు మధ్య గ్యాప్ ఉందనే వార్తలను కూడా ఆయన ఖండించారు.
తాను పోటీ చేయకపోయినా మంగళగిరిలో వైసీపీ గెలుస్తుందని స్పష్టం చేశారు. రాజకీయాలలో ఉంటే జగన్ తోనే ఉంటానని.. లేదంటే వ్యవసాయం చేసుకుంటానని అన్నారు. టికెట్ ఎవరికీ ఇచ్చినా ప్రచారం చేస్తానని చెప్పారు ఆర్కే. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటానని చెప్పారు.