Ilaiyaraaja: అంబేద్కర్‌తో మోడీని పోల్చిన ఇళయరాజా..మ్యూజిక్ డైరెక్టర్‌పై విపక్షాలు, నెటిజన్ల ఆగ్రహం

-

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా..వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఓ పుస్తకావిష్కరణలో ఇళయరాజా మాట్లాడిన మాటలపైన ఇప్పుడు చర్చ జరుగుతున్నది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జీవించే ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనను చూసి గర్వపడేవారని ఇళయరాజా అన్నారు.

బ్లూక్రాఫ్ట్‌ డిజిటల్‌ ఫౌండేషన్‌ వారు ముద్రించిన ‘అంబేడ్కర్‌ అండ్‌ మోడీ- రిఫార్మెర్స్‌ ఐడియాస్‌, రిఫార్మర్స్‌ ఇంప్లిమెంటేషన్‌’ అనే పుస్తకానికి ‘ముందుమాట’ రాసిన ఇళయరాజా పుస్తకావిష్కరణ సందర్భంగా మాట్లాడారు. అంబేడ్కర్‌ ఆలోచనలు, అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేసే వారిని అందరం కలిసి కచ్చితంగా ప్రోత్సహించాలని మ్యూజిక్ డైరెక్టర్ సూచించారు.

ఈ క్రమంలోనే ‘మేక్ ఇన్ ఇండియా’పైన ప్రశంసలు కురిపించారు ఇళయరాజా. సామాజిక న్యాయం కోసం మోడీ చట్టాలను అమలు చేస్తున్నారని, ప్రధాని మోడీకి, అంబేద్కర్ కు అనేక విషయాల్లో పోలికలున్నాయని చెప్పారు. మహిళల కోసం అంబేద్కర్ ఆలోచించారని, మోడీ కూడా ఆలోచిస్తున్నారని వివరించారు. ‘భేటీ బచావో, భేటీ పడావో, అమ్మాయి వివాహ వయసు పెంపు, త్రిపుల్ తలాక్ నిషేధం’ వంటి అంశాలను ఇళయ రాజా ప్రస్తావించారు.

ఇళయరాజా వ్యాఖ్యలపై విపక్ష పార్టీల నేతలు, కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తు్న్నారు.
అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం దళితుల అభ్యున్నతి, సమాజ శ్రేయస్సు కోసం పనిచేశారని, కానీ, మోడీ మనుధర్మ వ్యవస్థకు చెందిన వారని, వారిరువురికి పోలిక తగదని డీఎంకే ఎంపీ ఎలంగొవాన్ విమర్శించారు. కాగా, ఇళయ రాజా వ్యాఖ్యాలను బీజేపీ నేతలు ప్రశంసిస్తు్న్నారు. నెటిజన్లు కూడా ఈ విషయమై తమ అభిప్రాయాలను చెప్తున్నారు. మోడీని అంబేద్కర్ తో పోల్చడం సరికాదని ఇళయరాజాకు నెటిజన్లు సూచిస్తున్నారు. మొత్తంగా ఇళయరాజా తన వ్యాఖ్యలతో రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news