ముగిసిన టీమిండియా బ్యాటింగ్‌.. శ్రీలంక లక్ష్యం 163

-

నేటి నుంచి టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ షురూ అవుతోంది. తొలి మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే మైదానం ఆతిథ్యమిస్తోంది. ఈ పోరులో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. చివర్లో దీపక్ హుడా, అక్షర్ పటేల్ విజృంభించడంతో ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. హుడా 23 బంతుల్లోనే 1 ఫోర్, 4 సిక్సులతో 41 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సుతో 31 పరుగులు చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య 29, ఓపెనర్ ఇషాన్ కిషన్ 37 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ దూకుడు చూస్తే భారత భారీ స్కోరుపై కన్నేసినట్టు కనిపించింది. అయితే లంక స్పిన్నర్లు భారత్ దూకుడును అడ్డుకున్నారు. దాంతో 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది.

శుభ్ మాన్ గిల్ 7, సూర్యకుమార్ యాదవ్ 7, సంజు శాంసన్ 5 పరుగులకే అవుటై నిరాశపరిచారు. ఈ దశలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ అవుటయ్యాక, ఆ బాధ్యతను హుడా, అక్షర్ పటేల్ స్వీకరించారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ ఆఖర్లో బ్యాట్లు ఝుళిపించి భారత్ స్కోరును 150 మార్కు దాటించారు. లంక బౌలర్లలో తీక్షణ, మధుశంక, చామిక కరుణరత్నే, ధనంజయ డిసిల్వా, హసరంగ తలో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news