గత కొద్దికాలంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సీఎం జగన్ తనదైన శైలిలో షాక్ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో కీలక నేత.. మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై పార్టీ అధిష్ఠానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇటీవల బహిరంగ వేదికలపై వరుసగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకుంది. ఆనం వ్యాఖ్యలు, ఆయన వ్యవహారంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిపింది. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలను పిలిచి ఆనం వ్యవహారంపై చర్చించారు. కొంతకాలంగా ఆనం విమర్శలు చేస్తున్నా.. వేచి చూసే ధోరణిలో ఉన్న వైసీపీ అధిష్ఠానం.. రెండు, మూడ్రోజులుగా బహిరంగ వేదికలపై నుంచే ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తుండటంతో ఇకపై ఉపేక్షించకూడదని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఆనం రామనారాయణరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్టీ ముఖ్యనేతలకు సీఎం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. సీఎం ఆదేశాల మేరకు వైసీపీ అధిష్ఠానం ఆనంపై చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి ఎమ్మెల్యే ఆనంను తొలగించారు. వెంకటగిరి ఇన్‌ఛార్జిగా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి కుమారుడు రామ్‌కుమార్‌రెడ్డిని ప్రకటించారు. ఇన్‌ఛార్జిల మార్పుపై వైకాపా కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇన్‌ఛార్జిగా తొలగించడం ద్వారా నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణరెడ్డి ప్రాధాన్యతను తగ్గించేలా చర్యలు తీసుకుంది. ఇకపై విమర్శలు చేయకుండా కట్టడి చేయాలని భావిస్తోంది. వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి రామ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలను పాటించాలని స్థానిక అధికారులకు పార్టీ ముఖ్యనేతలు ఆదేశించినట్టు సమాచారం.