రెండు రోజుల విరామం తర్వాత యంగ్ ఇండియా మరో మ్యాచ్ కు సిద్ధమైంది. సౌతాఫ్రికాతో జరుగుతోన్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో టీమిండియా నిలిచింది. రాంచీ వేదికగా జరిగే రెండో వన్డేలో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఓడిపోతే మాత్రం సిరీస్ ఇక్కడితోనే చేజారనుంది. దాంతో తొలి వన్డేలో చేసిన పొరపాట్లను ఇక్కడ చేయకుండా రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలనే పట్టుదలగా శిఖర్ ధావన్ నాయకత్వంలోని భారత్ ఉంది. అదే సమయంలో తొలి వన్డేలో నెగ్గిన సౌతాఫ్రికా ఈ మ్యాచ్ లోనూ నెగ్గి సిరీస్ ను సొంతం చేసుకోవాలనే పట్టుదలగా ఉంది. కెప్టెన్ బవుమా ఫామ్ కంగారు పెడుతున్నా.. మిల్లర్ సూపర్ ఫామ్ తో పాటు క్లాసెన్ క్లాసీ టచ్.. డికాక్ నిలకడ జట్టుకు ప్రధాన బలంగా ఉన్నాయి. ఇక బౌలింగ్ కూడా భారత్ కంటే మెరుగ్గానే కనిపిస్తుంది. ఈ క్రమంలో రెండో వన్డేలో హోరాహోరీ పోరు తప్పక పోవచ్చు.
రెండో వన్డేలో టీమ్ ఇండియా ముందు సౌతాఫ్రికా 278 పరుగుల భారీ టార్గెట్‌ను విధించింది. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్స్‌లో హెండ్రిక్స్, మార్‌క్రమ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. రాంచీ వేదికగా ఆదివారం జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్ డికాక్‌ను తొందరగా ఔట్ చేసి సిరాజ్ టీమ్ ఇండియా లో ఆనందాన్ని నింపాడు. మరో ఓపెనర్ మలాన్ కూడా 25 పరుగులు చేసి ఔటయ్యాడు.