తెలంగాణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుద్ధవనం ప్రాజెక్ట్‌కు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్‌లో
తీర్చిదిద్దిన బుద్ధవనం ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయ అవార్డు దక్కింది. అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్స్ ఏటా అందిస్తున్న బంగ్లాదేశ్ భూటాన్, ఇండియా, నేపాల్ దేశాల టూరిజం మిత్ర అవార్డును అందుకుంది. కోల్‌కతాలోని సిటీ సెంటర్ సాల్ట్ లేక్ సీఐ హాలులో జరుగుతున్న బౌద్ధ సదస్సులో ఈ అవార్డును అందజేశారు. కొరియా ఇండియా ఫ్రెండ్‌షిప్ అసోసియేషన్ చైర్మన్ భిక్షు దమ్మదీప చేతుల మీదుగా బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఈ అవార్డు అందుకున్నారు.
తెలంగాణలోని బుద్దవనం ఆసియా దేశాల్లోనే ప్రత్యేకమైనదని అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక నిర్వాహక మండలి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి డా.కౌలేశ్ కుమార్, అధ్యక్షుడు డా.రవీంద్ర పంత్ ఈ సందర్భంగా కొనియాడారు. బుద్ధవనంలోని వివిధ విభాగాలు.. బౌద్ధ శిల్పకళ, బౌద్ధ సంస్కృతి పరిరక్షణకు, శాంతిని పెంపొదించేందుకు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. కాగా బుద్దవనం ప్రత్యేకతలపై ఈ బౌద్ధ సదస్సులో మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం బుద్దిజం ఎక్స్‌పర్ట్ కన్సల్టెంట్ డాక్టర్ శివనాగిరెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ వీడియో ప్రదర్శనకు సందర్శకుల నుంచి విశేష స్పందన లభించింది.