ప్రపంచంపై కరోనా పడగ ఇంకా పూర్తిగా పోలేదు. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ అయిపోయి థర్డ్ వేవ్ కూడా కొనసాగుతోంది. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే మళ్లీ మొదలవుతోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో మరో కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఇప్పుడీ వ్యాధి అక్కడ వేగంగా వ్యాప్తి చెందుతుండడం కలకలం రేపుతోంది. పొస్సమ్ అనే జీవుల నుంచి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు గుర్తించారు.
ఆస్ట్రేలియాలో బురులి అల్సర్ అనే వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది పొస్సమ్ అనే జీవి నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఆ జీవి మలంలో ఉండే బురులి బాక్టీరియా బురులి అల్సర్‌ను వ్యాపింపజేస్తుంది. ఈ వ్యాధి సోకిన వారికి తీవ్రమైన పుండ్లు అవుతాయి. వెంటనే స్పందించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వ్యాధి ప్రాణాంతకం అవుతుంది. ఈ వ్యాధి సోకిన భాగాలను తొలగించాల్సి ఉంటుంది. ఈ వ్యాధి ప్రస్తుతం ఎక్కువగా వ్యాప్తి చెందుతుండడం నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో ఇటీవలి కాలంలో బురులి అల్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. 2014లో 65 కేసులు బయట పడగా, 2019లో 299 మందికి ఈ వ్యాధి సోకింది. గతేడాది 218 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడితే బాక్టీరియా చర్మాన్ని చాలా వేగంగా నాశనం చేస్తుంది. ఈ క్రమంలో ముందుగానే గుర్తించి యాంటీ బయోటిక్స్‌తో చికిత్సను అందించాల్సి ఉంటుంది.
ఇక ఈ వ్యాధి కాళ్లు, చేతులు వంటి భాగాలకు సోకితే.. నిర్లక్ష్యం చేస్తే ఆయా భాగాలను తొలగించాల్సి ఉంటుందని వైద్య నిపుణులు తెలిపారు. ఈ వ్యాధి సోకిన వారికి శక్తివంతమైన యాంటీ బయోటిక్స్‌ను ఇస్తారు. ఈ క్రమంలో చికిత్స పూర్తయ్యేందుకు కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు సమయం పడుతుంది. బాక్టీరియా ఇన్ఫెక్షన్లతో వచ్చే టీవీ, కుష్టు, ప్లేగ్ వంటి వ్యాధులకు ఇచ్చే మెడిసిన్‌ను ఈ వ్యాధికి ఇస్తారు.
అయితే దోమల వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందన్న విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి రుజువులు లేవని, కానీ పొస్సమ్ అనే జీవి మలం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని మాత్రం నిర్దారించారు. ఈ క్రమంలో ఈ వ్యాధిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు తెలిపారు.