టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా పడింది. వాస్తవంగా ఆదివారం (ఏప్రిల్ 21వ తేదీ) ఆయన మనదేశానికి రావాల్సి ఉంది. అయితే టెస్లాకు సంబంధించిన అతి ముఖ్యమైన బాధ్యతల కారణంగా తాను రావట్లేదని ఎక్స్ వేదికగా మస్క్ వెల్లడించారు.
భారత్‌లో టెస్లా కార్యకలాపాలు వీలైనంత త్వరగా ప్రారంభమవుతాయని ఇటీవలే ఆ కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ అన్న విషయం తెలిసిందే. త్వరలోనే తాను భారత్లో పర్యటించబోతున్నానని, ఈ క్రమంలో ఈ అంశంపై ప్రకటన ఉండే అవకాశం ఉందని చెప్పారు. గతంలో మోదీతో భేటీ అయిన మస్క్ ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం తర్వాత ట్వీట్ చేసిన మస్క్.. తాను మోదీకి పెద్ద ఫ్యాన్ని అయిపోయానని చెప్పడం గమనార్హం.
టెస్లాను భారత్కు తీసుకువచ్చేందుకు ప్రధాని మోదీ నుంచి మంచి సహకారం లభిస్తోందని ఆశిస్తున్నానని అన్నారు. త్వరలోనే దీనిపై ఓ సానుకూల ప్రకటన ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఇండియాలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. కానీ తాజాగా మస్క్ పర్యటన రద్దయింది.