పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో ఆ దేశం అట్టుడికిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అరెస్టు అక్రమమని పాక్ సుప్రీంకోర్టు తేల్చింది. ఈ పరిణామాల మధ్య ఇమ్రాన్ తరఫు న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను జైల్లోనే హత్య చేసేందుకు కుట్రలు జరిగాయని ఆరోపించారు.
‘తనను జైల్లో నిద్ర పోనివ్వట్లేదని ఇమ్రాన్ చెప్పారు. టాయిలెట్, బెడ్‌లేని ఒక గదిలో ఆయన్ను ఉంచారు. వాష్‌రూమ్ వాడుకోవడానికి అనుమతించడం లేదు. చిత్రహింసలు పెట్టారు. నెమ్మదిగా గుండెపోటును ప్రేరేపించే ఆహారం, ఇంజెక్షన్లు ఇచ్చారు. ఛాతిలో అసౌకర్యంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇక ఇస్లామాబాద్‌లోని పోలీస్ లైన్స్‌కు తీసుకువచ్చిన తర్వాత ఆహారం కూడా ఇవ్వడం లేదు’ అని ఇమ్రాన్ న్యాయవాదులు మీడియా ముందు సంచలన ఆరోపణలు చేశారు.
తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పాక్ చీఫ్ జస్టిస్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణం నుంచి ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేయడంపై ఎన్‌ఏబీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది.