ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కాల్పుల విరమణ వ్యవహారం కీలక దశకు చేరింది. 40 రోజుల కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్ ప్రతిపాదించినట్లు.. సీజ్ ఫైర్ కోసం ప్రయత్నించిన అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెలిపాయి. హమాస్ చెరలోని బందీల విషయంలోనూ టెల్ అవీవ్ కాస్త పట్టు సడలించినట్లు వెల్లడించాయి. 40 మంది కంటే తక్కువ మందిని విడుదల చేసినా, ఒప్పందానికి తాము సిద్ధమేనన్న సంకేతం పంపినట్లు వివరించాయి.
ప్రస్తుతం హమాస్ చెరలో 133 మంది బందీలు ఉన్నట్లు సమాచారం. బందీల విడుదలకు ప్రతిగా పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టనుంది ఇజ్రాయెల్. హమాస్ మాత్రం 40 రోజులు కాకుండా శాశ్వత కాల్పుల విరమణ కోరుకుంటోంది. తాజా ప్రతిపాదనకు హమాస్ అంగీకరిస్తుందన్న ఆశాభావాన్ని అమెరికా వ్యక్తంచేస్తోంది. కాల్పుల విరమణపై ప్రయత్నాలు జరుగుతున్నా ఇజ్రాయెల్ రఫాపై తన దాడులను ఆపలేదు. సోమవారం జరిపిన గగనతల దాడుల్లో ఆరుగురు మహిళలు, ఐదురుగురు చిన్నారులు సహా 22 మంది పాలస్తీనీయన్లు మరణించారు.