తాజ్‌మహల్ వద్ద ఫొటో దిగొద్దని తన భార్య మేఘన్ మార్కెల్‌ను కోరినట్లు బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ తెలిపారు. ఎందుకు ఫొటో దిగొద్దని చెప్పారో దానికి గల కారణాన్ని హ్యారీ తాను రాసిన పుస్తకం స్పేర్‌లో ప్రచురించారు. ప్రస్తుతం ఈ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఇందులో హ్యారీ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌కు సంబంధించిన విషయాలనూ ఆయన ప్రస్తావించారు.
2017 జనవరిలో ఓ ఛారిటీ కార్యక్రమంలో భాగంగా మేఘన్ భారత పర్యటనకు వచ్చారు. ఆ తర్వాత హ్యారీ, మేఘన్‌ల పెళ్లి జరిగింది. అప్పటికి తన ప్రియురాలిగా ఉన్న మేఘన్ భారత పర్యటన గురించి ప్రిన్స్ హ్యారీ ప్రస్తావిస్తూ.. ‘‘పాలరాతి కట్టడమైన తాజ్‌మహల్ ముందు ఫొటో దిగవద్దని మేఘన్‌కు సూచించా. ఎందుకంటే.. ఆ అద్భుతమైన కట్టడం ముందు నా తల్లి (ప్రిన్స్ డయానా) ఫొటో దిగారు. అదెంతో ప్రాచుర్యం పొందింది. దాన్ని చూసినవారు మేఘన్ మా అమ్మను అనుకరిస్తోందని అనుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే అలా చెప్పా’ అని వివరించారు.