ఉక్రెయిన్పై భీకర యుద్ధం చేస్తున్న రష్యా మరో నగరాన్ని చేజిక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. భీకర పోరు తర్వాత ఉక్రెయిన్లోని బఖ్‌ముత్ నగరం తమ సొంతమైనట్లు రష్యా అధికారికంగా ప్రకటన జారీ చేసింది. రష్యా బలగాల సహకారంతో వాగ్నర్ ప్రైవేటు సైన్యం ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇదే తరహా ప్రకటనను వాగ్నర్ గ్రూప్ చేసిన 8 గంటల తర్వాత టెలిగ్రామ్ ఛానల్‌లో రష్యా రక్షణ శాఖ ప్రకటన చేసింది.
అయితే ఉక్రెయిన్ మాత్రం తమ సైనికులు ఇంకా బఖ్‌ముత్‌లో ఉన్నారని, పోరాడుతున్నారని తెలిపింది. బఖ్‌ముత్ కోసం పోరాటం ఏకంగా 8 నెలల పాటు సాగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అత్యంత రక్తపాతం చోటు చేసుకున్నది బఖ్‌ముత్‌లోనే కావడం గమనార్హం. బఖ్‌ముత్‌ను స్వాధీనం చేసుకున్నందుకు వాగ్నర్ ప్రైవేట్ ఆర్మీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందనలు తెలిపారు.
బఖ్‌ముత్ కోసం 8 నెలల పాటు భీకరపోరు సాగింది. ఇందులో ఎవరు ఎక్కువగా నష్టపోయారు అనే దానిపై స్పష్టత లేదు. అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ వేల సంఖ్యలోనే సైనికులను కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు.